EMI పద్ధతిలో వంటగ్యాస్ : ఒక్క రూపాయి కూడా లేకుండా కనెక్షన్

వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. నిరుపేదలకు వాయిదాల పద్ధతిలో వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కనెక్షన్లు ఇవ్వనుంది. ఆ డబ్బును EMI పద్ధతిలో వసూలు చేసేలా స్కీంను రూపొందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అంబేడ్కర్‌ జయంతి (ఏప్రిల్-14) రోజున పంపిణీ ప్రారంభించాలని చమురు సంస్థలను ఆదేశించింది కేంద్రం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద నిరుపేదలకు వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేయవద్దని కేంద్రం స్పష్టం చేసినట్లు డీలర్లు చెబుతున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రులు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రచార కార్యక్రమాలనూ కేంద్రమే రాష్ట్రాలకు పంపనుంది.
సబ్సిడీ నుంచి EMI వసూలు:
కనెక్షన్‌ డిపాజిట్‌ సొమ్మును కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తోంది. లబ్ధిదారులు పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. స్టౌకి రూ.900, గ్యాస్‌ కు రూ.700 లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా.. ఆ మొత్తాన్నీ వాయిదాల రూపంలో వసూలు చేయాలని నిర్ణయించింది. కనెక్షన్‌ తీసుకున్న ఏడో నెల నుంచి సిలిండరు తీసుకోగానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేసే సబ్సిడీ సొమ్మును వాయిదా మొత్తంగా కేంద్రం రాబట్టుకోనుంది. కనెక్షన్‌ ఇచ్చినట్లు నిర్ధారించుకున్న మీదట ఆ మొత్తాన్ని డీలర్ల ఖాతాల్లో సర్దుబాటు చేయనుంది.
లబ్ధిదారుల ఎంపిక బాధ్యత డీలర్లదే:
అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు బాధ్యతనూ డీలర్లకే అప్పగించింది. రేషన్‌ దుకాణాలు.. ఈ-సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వివరాలను సేకరించి క్షేత్రస్థాయిలో నిర్ధారించుకున్న తరవాత లబ్ధిదారులను ఎంపిక చేయాలి. SC, ST, అత్యంత వెనుకబడినవారు, నదీ తీర ప్రాంతాల్లో, తేయాకు తోటల్లో పని చేసే వారు, అటవీ ప్రాంత నివాసితులను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించింది కేంద్రం. ప్రతి డీలరు తొలిదశలో వంద కనెక్షన్లు ఇవ్వాలి. అంబేడ్కర్‌ జయంతి రోజున ప్రతి డీలరు 500 మందిని ఎంపిక చేసి, గ్రామ సమక్షంలో వందమందికి కనెక్షన్లు అందచేయాలని రెండు రాష్ట్రాల డీలర్లకు చమురు సంస్థలు స్పష్టం చేశాయి. స్థానికంగా ఎవరైనా సామాజిక కార్యకర్త ఉంటే వారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *